పులి-బ్రాహ్మణుడు కధ

ఒక పెద్ద అరణ్యం లో ఓ పెద్దపులి వుండేది. దానికి మనిషి మాంసం అంటే మహా ఇష్టం. ఐతే ఆ ఘోరారణ్యం లో మనుషులు ఎక్కడనుంచి వస్తారు? అందుకని అది అడవి లోని జంతువుల్ని వేటాడి తినసాగింది. కాని పులి కోరిక తీరలేదు. కొన్నాళ్ళకి అది ముసలిది ఐపోయింది. వేటాడే ఓపిక లేక ఏదో ఎత్తు వేసి దగ్గరకు వచ్చిన జంతువులను చంపి తినసాగింది.


ఒక రోజు ఆ అరణ్యమార్గాన ఒక బ్రహ్మణుడు వెళ్తుండడం పులి చూసింది. దానికి నోరూరింది. అతడిని ఎలాగైనా చంపి తినాలని ఆలోచించింది. దాని దగ్గర బంగారు కడియం ఒకటి వుంది. ఆ కడియం ఆశ చూపి బ్రహ్మణుడిని దగ్గరకు పిలవాలని ఎత్తు వేసింది. మామూలుగా పిలిస్తే పులి దగ్గరకు ఎవరు వస్తారు, అందుకని అది అక్కడ వున్న చెఱువులో దిగింది. మునిగిపొతున్నట్లు నటించి, "రక్షించండి! రక్షించండి!" అని ఏడుస్తూ అరవసాగింది.  ఆ దారిన వస్తున్న బ్రాహ్మణుడు పులి అరుపులు విని అక్కడకు వచ్చాడు. చెఱువు గట్టున నిలిచి, వత్తుగా పెరిగిన తుంగ గడ్డిలో పులి ఇరుక్కుని వుండడం, అది భయపడి ఏడవడం అతనికి కనిపించాయి. 
 
ఏంచెయ్యాలొ తోచక అక్కడే నిలిచిచుస్తున్న అతడిని చూసి పులి "ఓ బ్రహ్మణుడా! నన్ను రక్షించు, నిన్ను నేను ఏమీ చెయ్యను, పైగా ఈ బంగారు కడియం కానుకగా ఇస్తాను. నన్ను నమ్ము, నేను కౄరజంతువునైనప్పటికిని వౄధ్ధాప్యంచేత మాంసాహారాన్ని మానివేసాను. నాకు ప్రాణదానం చెయ్యి, నీకు ఈ బంగారు కడియం ఇస్తాను.  బ్రాహ్మణునికి బంగారు కడియం మీద ఆశ కలిగింది. కాని పులి మాట మీద నమ్మకం కలగడం లేదు. పాపం పులి మాత్రం దీనంగా పిలుస్తోంది. బ్రహ్మణుడు ధైర్యం చేస్తే తప్పా సంపద లభించదని పెద్దలు చెప్పినమాటను గుర్తుకు తెచ్చుకున్నాడు. ఆలోచించి లాభంలేదని చొరవజేసి చెరువులొ దిగి పులిని నెమ్మదిగా గట్టుమీదకు తీసుకువచ్చాడు.
 
పులి పైకి వచ్చి వళ్ళు విదిలించుకుంది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు "పులిరాజా! బంగారు కడియం ఇవ్వవా?" అని అడిగేడు. దానికి పులి నవ్వి, "తప్పక ఇస్తాను, చెఱువులో స్నానం చేసిరా" అంది. అప్పటికీ బ్రాహ్మణుడు పులి ఎత్తుగడను గమనించక వెర్రివాడై, వెళ్ళి చెఱువులో దిగాడు. వెంటనే పులి బ్రాహ్మణునిపై దూకి, పీకపట్టుకొని చంపి తినేసింది.

No comments:

Post a Comment