తల్లి ద్వారా వచ్చే ఆక్సిటోసిన్ కారణం గా పిల్లల్లో ప్రేమ, వాత్సల్యాలకు బీజం పడుతుంది. ఏడాది వచ్చేసరికి నడవడం, మాట్లాడడం మొదలుపెట్టే బిడ్డ ఎక్కువసమయం తన తల్లితోనే గడుపుతుంది. సంపూర్ణ మానవుని మెదడు పరిమాణము 1400 గ్రాములుంటే అందులో 5,6 సంవత్సరాలలోనే 1200 గ్రాముల భాగం నిర్మాణమైపోతుంది. మొదటి సంవత్సరంలోనే ఎదురయ్యే ఎన్నో అనుభూతులు మెదడులో నిక్షిప్తమై వారి స్వభావాన్ని తీర్చిదిద్దడానికి దోహదకారి అవుతుంది. తల్లి చూపే ప్రేమ బిడ్డలో సాత్విక లక్షణాలకు మూలమవుతుంది. 5,6 సంవత్సరాలలోపున వారికి దొరికిన అనుభవాలు, అనుబంధాలు వారి వ్యక్తిత్వ రూపకల్పనకు పునాదిరాళ్ళు అవుతాయి.
సంస్కారాల సాధనా మందిరం మాతృమూర్తి ఒడి. అమ్మ చేసే ప్రతి పనిని పసిబిడ్డ అత్యధిక శ్రద్ధ తో గమనిస్తూంటుంది. తల్లి ఉదయం నిద్రలేవగానే ఎదురుగా కనిపించే ఇష్ట దైవానికి నమస్కరించుకోవడం చూసి చిట్టి చిట్టి చేతులతో వచ్చీరాని జోతలు పెడుతుంటుంది. ఇంటికి వచ్చిన అతిథులను తల్లి సాదరంగా ఆహ్వానిస్తుంటే పిల్లలు కూడా ఆ ఆతిధ్యస్వభావాన్ని అలవరచుకుంటారు. పెద్దలపట్ల మర్యాద, ప్రేమ వారికి సేవ చెయ్యలనే తపనలకు తల్లే శ్రీకారం చుట్టగలదు. వృద్ధులైన పెద్దలకు తాను సేవ చేస్తూ బిడ్డల చేత మందిప్పించడం, మంచి నీళ్ళు అందించడం నేర్పిస్తుంటే ఆ ముసలివాళ్ళ పట్ల తమకి వున్న బాధ్యతను తెలుసుకుంటారు.
వాకిట్లో భిక్షగాడికి తల్లి పెడుతున్న అన్నం, పళ్ళెం లో వేరుగా వుంచిన తొలి అన్నం ముద్ద కై గోడమీద ఎదురుచూస్తున్న కాకులు ,పక్షులను చూసిన సంతానానికి 'ఆత్మవత్సర్వ భూతెషు ' అనె భగవంతుని వాక్యం జీర్ణం కాకుండాపోతుందా? ఆవులకు గడ్డి వెయ్యాలి, కోళ్ళకు మేత పెట్టాలి, కుక్కలకు పిల్లులకు పాలు పొయ్యాలి, చెత్లకు నీరుపొయ్యలనే భూత దయ, కరుణ భావన ఆ తల్లి పెంపకం లో బిడ్డల్లో పాతుకోకుండాపోతుందా? ఇంటి చుట్టూ ఉన్న రకరకాల చెట్లు, వాటిపై రంగురంగుల పక్షులు, అందమైన పూలు, పండ్లు ఇంకా ఆకాశం లో చందమామ అలా అలా తేలిపోయె మబ్బులు వీటిని చూపిస్తూ అమ్మ అన్నం తినిపిస్తుంటే ప్రకృతి తో అవినాభావసంబంధం బలపడకుండా వుంటుందా?
ఆటలాడుతూ భూమిని గట్టిగా తన్నిన బిడ్డని అలా చెయ్యకునాయనా, భూమాత బాధపడుతుంది, అలుగుతుంది, మనల్ని శపిస్తుంది అని మందలిస్తూనే ఈ పుడమి మా తల్లి మేం ఆమె సంతానం అనే భావనకు ఊపిరిపోస్తుంది. బాలకృష్ణుని బాల్య చేష్టలు ఉత్సాహాన్ని, అల్లరిని నింపితే రాముని కధలు ఆర్తిని కలగజేస్తాయి. భీమార్జునులు, హనుమంతుడు వారి ఆటల్లో మాటల్లో కధానాయకులవుతారు.
ఇరుగు పొరుగు వారితో కలసి మెలసి ఉండే తల్లి పరస్పరసహకారగుణాన్ని తన సంతానానికి అందిస్తుంది. ఇంటి వాతావరణం లోని కలివిడితనం, సంతోషం, ప్రశాంతతల మధ్య పెరిగిన పిల్లలు పదిమంది మధ్య నిర్భయంగా మనగలగడం, అందరితో కలిసిపోయి ఆనందాన్ని పంచుకోవడం అలవర్చుకుంటారు. ఇతరుల ముందు పిల్లల్ని చిన్నబుచ్చకుండా వారు తప్పు చేస్తే సున్నితం గా మందలించి మౌనం గా ఉండే తల్లి, బిడ్డలోని ఆత్మపరిశీలనా గుణానికి శ్రీకారమవుతుంది.
కన్న బిడ్డకు పది నిమిషలైనా దైవప్రార్ధన నేర్పి, సర్వేజనాసుఖినోభవంతు అని విశ్వజనుల శ్రేయస్సు కోరే మాతృ మూర్తి విశ్వగురుస్థానం లో నిలుస్తుంది. అటువంటి మాతృమూర్తికి శిరస్సు వంచి నమస్కరిస్తూ......
మాతృదేవోభవ!
No comments:
Post a Comment