D.K. Pattammaal

దాదాపు అరవై ఏళ్ళ కిందట ఢిల్లీ ఆలిండియా రేడియో వారు సంగీత సమ్మేళన్ కచేరీలు ఏర్పాటు చేసారు. ఈ కచేరీలు ప్రజా సమక్షంలో జరిగేవి. వీటిని రికార్డ్ చేసి తరువాత రేడియోలో ప్రసారం చేసేవారు. 1950లో ఆ కచేరీకి ఓ ముఫ్ఫైఏళ్ళ మహిళని పాడమని పిలిచారు. ఆమె వర్ణంతో కచేరీ ప్రారంభించి గణేశ ప్రార్థన, ఆ తరువాత దేవగాంధారి రాగంలో ‘సీతా వర సంగీత జ్ఞానము ధాత వ్రాయవలెరా’ పాడడం మొదలు పెట్టారు. ఇంతలో ఒక చిన్న భూకంపం రావడంతో ప్రేక్షకులు భయంతో ఆ హాలు విడిచి బయటకు పారిపోయారు. జనం వెళ్ళిపోవడం చూసి పక్క వాయిద్యకారులు కంగారు పడ్డారు కానీ అలాగే భయపడుతూ వాయించారు. పక్క వాయిద్యకారుల పరిస్థితి కానీ, జనం హాహాకారాలు చేయడం, భయంతో పరుగులు తీయడం ఇవేమీ కళ్ళు మూసుకుని పాడడంలో నిమగ్నమయిపోయిన ఆవిడకి తెలియవు. భూకంపం హడావిడి తగ్గాక ప్రేక్షకులు లోపలికి వచ్చారు. వారికి ఆశ్చర్యం కలిగించేలా ఆమె ఇంకా పాడుతూనే వుంది. పాట పూర్తయ్యాక కళ్ళు తెరిచి చూస్తే ప్రేక్షకులందరూ లేచి నిలబడి కరతాళ ధ్వనులు చేయడం కనిపించింది. ఆ తరువాత పక్క వాయిద్యం వాయిస్తున్న ఓ వ్యక్తి అసలు విషయం చెప్పారు. ఆ కచేరీ చేసిన మహిళ డి.కె.పట్టమ్మాళ్. భూకంపం సంగతి ఆమెతో తరువాత ప్రస్తావించినప్పుడు, “భూకంపం వచ్చి నా ప్రాణం పోవాలని రాసుంటే అదెలాగూ జరుగుతుంది. ప్రాణమ్మీద తీపితో కచేరీ చెయ్యకుండా ఇచ్చిన మాట తప్పిందన్న అప్రతిష్ట నాకు చావు లాంటిదే. నేను సంగీతానికీ కట్టుబడున్నాను. అదే నా ఊపిరి” అన్నారామె. ఈ సంఘటన చెప్పింది ఆమె భర్త ఈశ్వరన్. ఆనాటి కచేరీకి సర్వేపల్లి రాధాకృష్ణన్ రావలసి ఉన్నా, ఎందుచేతనో రాలేకపోయారు. భూకంపం వచ్చినా కదలకుండా తన్మయత్వంతో ఆమె పాడడం గురించి తెలుసుకొని ఆ మర్నాడు ఆయనింట్లో మరో కచేరీ ఏర్పాటు చేయించుకున్నారు. ఆమె అసలు పేరు అలిమేలు. కానీ పదిమందికీ ఇంట్లో అందరూ పిలిచే ముద్దుపేరు పట్టమ్మ గానే తెలుసు. ఆచారాలకి వ్యతిరేకంగా, సాంప్రదాయలకీ భిన్నంగా పురుషులతో సమంగా కచేరీ చేసిన మొట్టమొదటి మహిళ ఆమె. పూర్వం దేవదాసీ స్త్రీలు మాత్రమే సంగీత కచేరీలిచ్చేవారు. త్యాగరాజు కాలంలో తంజావూరు కమలం, ఆ తరువాత బెంగుళూరు నాగరత్నమ్మ అలా పేరొందిన సంగీత విదుషీమణులు. ఒక సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం నుండొచ్చి స్టేజెక్కి కర్ణాటక సంగీత కచేరీలిచ్చిన మొట్ట మొదటి మహిళ పట్టమ్మాళ్. ఎం ఎస్ సుబ్బులక్ష్మి పదేళ్ళ వయసులో ఉండగా 1926లో మొదటి రికార్డ్ ఇచ్చినా మొదటి కచేరీ మాత్రం పట్టమ్మాళ్ ఇచ్చిన తరువాతే ఇచ్చారు. అంత వరకూ సంగీత కచేరీల్లో మగవాళ్ళదే పైచేయిగా ఉండేది. ఆడవాళ్ళ సంగీతాన్ని పెళ్ళి సంగీతంగానే అందరూ జమకట్టేవారు. వారందరి అభిప్రాయాలూ తప్పని రుజువు చేస్తూ కర్ణాటక సంగీతంలో ఓ నూతనాధ్యాయాన్ని సృష్టించిన తొలి మహిళ పట్టమ్మాళ్. (గొర్తి సాయి బ్రహ్మానందం గారి వ్యాసం నుంచి)

No comments:

Post a Comment